Krishna District: కేటుగాడు : విద్యుత్ లైన్ మేన్ అవతారం... చోరీలే వ్యవహారం
- విలాసాలకు, వ్యసనాలకు అలవాటుపడి పక్కదారి
- మూడు జిల్లాల్లో తెలివిగా మోసం
- ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వైనం
ఇంట్లో విద్యుత్ సరఫరాలో సమస్య ఉందని సమాచారం ఇస్తే క్షణాల్లో వచ్చివాలిపోతాడు. సమస్య పరిష్కరిస్తూనే ఇంటి అనుపానువులు తెలివిగా గమనిస్తాడు. భారీగా నగదు, బంగారం ఉందని తేలిందో? ఇక అంతే సంగతులు. విద్యుత్ లైన్ మేన్ అవతారంలో మరమ్మతుల పేరుతో ఇంట్లోకి ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగని ఎట్టకే లకు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే...తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన చీకటి లక్ష్మణ్ వృత్తి రీత్యా ఎలక్ట్రిషియన్. వ్యసనాలకు, విలాసాలకు బానిసై డబ్బుకోసం చోరీలు మొదలు పెట్టాడు. తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన పలు దొంగతనాల్లో కృష్ణ పై అనుమానం రావడంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు.
నిన్న ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి బి.కాలనీ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న కృష్ణను క్రైం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 26 కాసుల బంగారం, కేజీ వెండితోపాటు రూ.1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో తూర్పు గోదావరి జిల్లా రావులపల్లిలో ఒకటి, గుంటూరు నగరంలో మూడు, ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ, నందిగామలోని ఇళ్లలో జరిగిన దొంగతనాలతో సంబంధం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు.