visakhapatnam: సాగర తీరంలో 42 కే మారథాన్ : నీలి సంద్రాన్ని తలపించిన విశాఖ బీచ్ రోడ్డు
- నేవీ మారథాన్ కు పోటెత్తిన ఔత్సాహికులు
- తెల్లవారు జామున 4.30 గంటలకే ప్రారంభం
- మొత్తం నాలుగు విభాగాల్లో పోటీలు
తూర్పు తీరంలోని విశాఖ బీచ్ రోడ్డు ఈ రోజు నీలి సంద్రాన్ని తలపించింది. ఏటా నావికా దళం నిర్వహించే 'వైజాగ్ నేవీ మారథాన్' పోటీలకు ఔత్సాహికులు పో టెత్తారు. మొత్తం నాలుగు విభాగాల్లో జరిగిన మారథాన్ పోటీలు తెల్లవారు జామున నాలుగున్నర గంటలకే మొదలయ్యాయి. తెల్లవారు జామున తొలుత ప్రారంభమైన 42 కిలో మీటర్ల ఫుల్ మారథాన్ పోటీలను నేవీకి చెందిన ఐఎన్ఎస్ కళింగ ప్రధానాధికారి కమాండర్ రాజేష్ దేవనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. బీచ్ రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద ప్రారంభమైన ఫుల్ మారథాన్ చిప్పాడ గ్రామం (హోటల్ ప్యారడైజ్) వరకు వెళ్లి తిరిగి ఫంక్షన్ హాల్ వద్దకు తిరిగి చేరడంతో ముగుస్తుంది.
ఆ తర్వాత ఒక్కో పోటీ మధ్య గంట వ్యవధి ఇస్తూ 21 కె, 10కె, 5కే మారథాన్ పోటీల ప్రారంభించారు. చివరిగా నిర్వహించిన 5కే మారథాన్ కు ఔత్సాహికులు మరింత పోటెత్తారు. నీలం రంగు టీ షర్ట్ లతో ఔత్సాహికులు బీచ్ రోడ్డు నీలి ప్రవాహాన్ని తలపించింది. ఫుల్ మారథాన్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి కింద రూ.75 వేలు, రూ.50 వేలు, రూ.25 వేలు అందించారు.
మిగిలిన విభాగాల్లోనూ ఇదే తరహాలో ప్రైజ్ మనీ అందించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నీలంరంగు టీషర్ట్ అందజేశారు. పరుగు ప్రారంభించి తిరిగి లక్ష్యానికి చేరుకున్న అందరికీ పతకం, ప్రశంసాపత్రాన్ని ఇచ్చారు. తెల్లవారు జామున ప్రారంభమైన కార్యక్రమంతో ఉదయం ఎనిమిది గంటల వరకు బీచ్ రోడ్డులో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.