MRPS: హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ను దిగ్బంధించిన పోలీసులు!
- మహాదీక్షకు పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్
- తెలుగుతల్లి ఫ్లయ్ ఓవర్ మూసివేత
- పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహా దీక్షకు పిలుపునివ్వగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్క్ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఈ ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. తెలుగుతల్లి ఫ్లయ్ ఓవర్ ను మూసివేసిన పోలీసులు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. ఇందిరా పార్క్ చుట్టూ ఆంక్షలను విధించి, ఎమ్మార్పీఎస్ కు చెందిన పలువురు నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ మహాదీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మేరకు తమకు సమాచారం అందిందని, అందువల్లే ఆంక్షలు విధించామని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.