Chinthamaneni Prabhakar: నా ఆస్తులు తగలేసుకునేవాడ్నే తప్ప, ఎవరి ఆస్తులూ దోచుకోలేదు: చింతమనేని
- బెయిల్ పై విడుదలైన చింతమనేని
- మీడియా సమావేశంలో వ్యాఖ్యలు
- అన్యాయంగా కేసులు బనాయించారని ఆవేదన
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెయిల్ పై విడుదలయ్యారు. జైలు నుంచి వెలుపలికి వచ్చిన ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ దళితుడి ఆస్తి కోసం ఆశపడలేదని, ఇతరులకు సాయం చేసేందుకు తాను సొంత ఆస్తులు తగలేసుకునేవాడ్నే తప్ప, ఇతరుల ఆస్తులు తనకు అవసరంలేదని అన్నారు. 18 కేసులు పెట్టి ఎవర్ని వేధించాలనుకుంటున్నారు? అంటూ చింతమనేని ప్రశ్నించారు. ఒక్క కేసులో తాను తప్పు చేసినట్టు తేలినా, ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమని అన్నారు.
"గతంలో నువ్వు వేదనకు గురయ్యావు కదా అని ఇతరులను కూడా అలాగే వేధించడం సరికాదు. నీకు 150 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అహంభావం, పొగరుతో వ్యవహరించడం అవసరమా? సెక్షన్ 30 అమలు చేసినా అభిమానులను ఎందుకు కొట్టారు? ఏం నష్టం జరుగుతుందని విగ్రహాలకు దండ వేయొద్దన్నారు?" అంటూ పరోక్షంగా సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేశారు.
మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవడం అంటే, రైతు భరోసా అమలు చేయడం, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇవ్వడం, ఆరోగ్య శ్రీ అమలు చేయడం మాత్రమే కాదు, శాంతిభద్రతలను అమలు చేసి, ఇతరుల మనసులు గాయపర్చకుండా ఉన్నప్పుడే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటారని హితవు పలికారు. తన నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా తనను దళిత వ్యతిరేకి అని నిరూపిస్తే, తనకు జగన్ మోహన్ రెడ్డి శిక్ష వేయనక్కర్లేదని, న్యాయస్థానాలు శిక్ష వేయనక్కర్లేదని, తానే దోషినని ఒప్పుకుంటానని స్పష్టం చేశారు.