SI: ఇష్టంలేని బదిలీ చేశారని ఎస్సై వినూత్న నిరసన.... వికటించిన ప్రయత్నం
- 65 కిమీ పరుగెత్తేందుకు ఎస్సై సాహసం
- మరో పీఎస్ కు బదిలీ చేసినందుకు నిరసనగా మారథాన్
- మధ్యలోనే సొమ్మసిల్లిన ఎస్సై
తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మరోచోటికి బదిలీ చేశారంటూ ఓ ఎస్సై కొత్త పద్ధతిలో నిరసన తెలిపాడు. యూపీలో విజయ్ ప్రతాప్ అనే యువ సబ్ ఇన్ స్పెక్టర్ ఆగ్రాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నతాధికారులు అతడిని మరో పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ బదిలీ ఇష్టంలేని విజయ్ ప్రతాప్ విచిత్రంగా నిరసన తెలియజేశాడు. తాను విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ లైన్స్ పీఎస్ నుంచి బదిలీ చేసిన పోలీస్ స్టేషన్ (బిథోలీ) వరకు పరుగెత్తాలని నిర్ణయించుకున్నాడు. ఈ రెండు పీఎస్ ల మధ్య దూరం 65 కిలోమీటర్లు.
అయితే ఎలాగోలా సగం దూరం పరుగెత్తిన విజయ్ ప్రతాప్ ఆ తర్వాత బాగా అలసిపోయాడు. అయినప్పటికీ పరిగెత్తే ప్రయత్నం చేయడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ఓ అధికారి తనపై కక్షగట్టి బదిలీ చేయించాడని, సీనియర్ ఎస్పీ చెప్పినా వినకుండా మరో పీఎస్ కు పంపాలని ప్రయత్నిస్తున్నాడని విజయ్ ప్రతాప్ మీడియాకు వెల్లడించాడు. "మీరు దీన్ని ఆగ్రహం అనండి, అసంతృప్తి అనండి... నేను మాత్రం పరుగెత్తుతూ బిథోలీ వెళ్లి తీరతాను" అంటూ మొండివైఖరి ప్రదర్శిస్తున్నాడు.