Pondycherry: పుదుచ్చేరిలో ఉచిత బియ్యం పథకం అమలుపై లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంల మధ్య రగడ
- పథకాన్ని వ్యతిరేకించడం అసమంజసమన్న సీఎం
- పేద ప్రజల పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేయడంలేదంటూ విమర్శలు
- ఉచిత బియ్యం బదులు.. నగదు ఇవ్వాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ
పుదుచ్చేరిలో ప్రజాభిప్రాయం మేరకే ఉచిత బియ్యం పథకం తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టామని ఆ రాష్ట్ర సీఎం నారాయణస్వామి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. నారాయణ స్వామి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఈ పథకాన్ని వ్యతిరేకించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బియ్యం పథకం అమలుకోసం ముందస్తుగా కసరత్తు చేసిన తర్వాతే అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. ఆరునెలలుగా ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.
కాగా, గవర్నర్ దీనిపై జోక్యం చేసుకుని ఉచితంగా బియ్యాన్ని అందించరాదంటూ.. బియ్యానికి బదులు నగదు ఇవ్వాలంటున్నారని ఆయన పేర్కొన్నారు. కిరణ్ బేడీ కాంగ్రెస్ పార్టీని కావాలనే వ్యతిరేకిస్తున్నారని, ఇందుకు కేంద్రం సహకరిస్తోందని సీఎం విమర్శించారు. కిరణ్ బేడీ చర్యలకు త్వరలో ముగింపు పలికే రోజులు వస్తాయన్నారు. పుదుచ్చేరిని కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతోపాటు, సంక్షేమ పథకాల అమలుకు మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించడంలేదని ఆరోపించారు.