Karnataka: ఏడాదిన్నరలో రూ.185 కోట్లు పెరిగిన బీజేపీ నాయకుడి ఆదాయం!
- అఫిడవిట్లో ఆస్తుల వివరాలు
- నోరు వెళ్లబెట్టిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి
- రూ.1015 కోట్ల నుంచి 1201 కోట్లకు పెరిగిన సంపద
కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఎం.టి.బి.నాగరాజు సంపాదన ఏడాదిన్నర కాలంలో 185 కోట్లు పెరిగింది. అఫిడవిట్ లో ఆయన దాఖలు చేసిన వివరాలు చూసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోరు వెళ్లబెట్టాడు.
వివరాల్లోకి వెళితే కర్ణాటకలో 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల పై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలకు డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే ఎం.టి.బి.నాగరాజు ఈసారి బీజేపీ టికెట్ పై హెూస్కోటే నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు.
నామినేషన్ సందర్భంగా ఆయన దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్ చూసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆశ్చర్యపోయారు. అఫిడవిట్ లో తన ఆస్తుల మొత్తం విలువ రూ. 1201 కోట్లుగా చూపించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ లో తన ఆదాయం రూ. 1015 కోట్లుగా నాగరాజ్ చూపించారు.
కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో తన ఆస్తుల విలువ సుమారు రూ. 185 కోట్లు పెరిగినట్లు ఆయన చూపించారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆగస్టులో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తన ఆస్తుల విలువలో 25.84 శాతం పెరుగుదల నమోదైందని పేర్కొన్నారు.