samlkot: అమ్మాయి ఎర.. ఆపై బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న ముఠాకు సంకెళ్లు!
- ఫైనాన్స్ వ్యాపారిని తెలివిగా ఓ ఇంటికి రప్పించిన మహిళ
- అతడితో కలిసి ఉండగా రంగంలోకి దిగిన బ్లాక్ మెయిల్ ముఠా
- రూ.25 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులు
అమ్మాయిని ఎరగా వేసి లక్షలాది రూపాయలు గుంజేందుకు ప్రయత్నించిన ముఠాను తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. జి.మామిడాడకు చెందిన తాడి కేదారమణికంఠరెడ్డి ఫైనాన్స్ వ్యాపారి. తేతలి దుర్గారెడ్డి కాకినాడలో జై ఆంధ్రా చానల్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా స్థల వివాదం ఏర్పడింది. దీంతో దానిని పరిష్కరించుకునేందుకు దుర్గారెడ్డి వక్రంగా ఆలోచించాడు.
తన చానల్లో పనిచేస్తున్న రాకేశ్ అనే వ్యక్తి సాయంతో మహేశ్-అశ్విని అనే భార్యభర్తలను రంగంలోకి దింపాడు. వీరి సహకారంతో మడికి అశోక్ అనే వ్యక్తి ఇంటికి కేదారమణికంఠరెడ్డిని రప్పించాలనుకున్నారు. ఈ క్రమంలో మణికంఠరెడ్డికి ఫోన్ చేసిన అశ్విని మాయమాటలతో అశోక్ ఇంటికి అతడిని రప్పించింది. అతడు వచ్చాక ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్లారు. వారు వెళ్లిన మరుక్షణం అక్కడే కాపుకాసిన బ్లాక్మెయిల్ ముఠా.. వారి వీడియో తీసి అతడికి చూపించి బెదిరింపులకు దిగింది. అయినప్పటికీ మణికంఠరెడ్డి లొంగకపోవడంతో అతడిని కుర్చీకి కట్టేసి చిత్రహింసలు పెట్టారు.
రూ.25 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని, లేదంటే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. దీంతో మణికంఠరెడ్డి రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి సరేనన్న ముఠా సభ్యులు.. కేదార్ వద్ద ఉన్న రూ.63 వేల నగదు, బంగారు ఆభరణాలు లాక్కుని తెల్లకాగితాలపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుని పరారయ్యారు.
ఈ నెల ఏడో తేదీన ఈ ఘటన జరిగింది. 8న కేదార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈనెల 14న ఇంద్రపాలెంలో ఒక ఇంటిలో ఉన్న నిందితులు ఆరుగుళ్ల మహేష్, భూరి అశ్విని, నిమ్మకాయల సతీష్, తోట సందీప్, బొడ్డుపు రాజేష్‌కుమార్, ఎలుడుట్టి లక్ష్మీనారాయణ, మడికి అశోక్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని వారు అంగీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దుర్గారెడ్డి, రాకేష్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.