tsrtc: అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఇంటి తలుపులు బద్దలుగొడుతున్న పోలీసులు
- యూనియన్ కార్యాలయంలో దీక్షకు జేఏసీ పిలుపు
- భారీగా మోహరించిన పోలీసులు
- జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని గృహ నిర్బంధం
- అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వివిధ డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 43వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నేడు ‘బస్ రోకో’కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరోవైపు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో దీక్ష చేపట్టాలంటూ నేతలు పిలుపునిచ్చారు.
జేఏసీ పిలుపు నేపథ్యంలో యూనియన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. మరోవైపు, జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే, అప్పటికే అశ్వత్థామరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.