one nation- one pay day: దేశవ్యాప్తంగా కార్మికులందరికీ ఒకేవిధంగా కనీస వేతనాలు: కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ వెల్లడి
- దేశ వ్యాప్తంగా ఒకే రోజు వేతనాలు
- కార్మికులందరికీ రూ.3వేల పింఛనుతో పాటు వైద్య బీమా
- సంబంధించిన చట్టం త్వరలోనే తీసుకొస్తున్నాం
శ్రామికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడివుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ అన్నారు. ఢిల్లీలో సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రామిక వర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘‘వన్ నేషన్-వన్ పే డే’’ (ఒకే దేశం-ఒకేరోజు వేతనం) తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు.
‘దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో ఓకే రోజు వేతనాలు అందించేందుకు సిద్ధమవుతున్నాం. ఇందుకోసం ఉద్దేశించిన చట్టాన్ని ప్రధాని మోదీ త్వరలోనే తీసుకురాబోతున్నారు. అలాగే, కార్మికులకు మెరుగైన జీవితం గడిపేందుకు అన్ని రంగాల్లో ఒకే విధంగా కనీస వేతనాలు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నాం’ అని మంత్రి చెప్పారు.
మోదీ ప్రభుత్వం 2014 నుంచే కార్మిక సంస్కరణలను ప్రారంభించిందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు విభాగాలుగా విభజించి చట్టాలు చేయాలనుకుంటోందని తెలిపారు. త్వరలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ రూ.3వేల పింఛనుతో పాటు వైద్య బీమా అందించేందుకు తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
రానున్న రోజుల్లో అసంఘటిత రంగ కార్మికులు, కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు మరిన్ని పథకాలు తీసుకురానున్నమని చెప్పారు. అధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న వాటిల్లో ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమ అతిపెద్దదన్నారు. ఇందులో 90 లక్షలు మంది పనిచేస్తున్నారని, త్వరలో ఈ సంఖ్య 2 కోట్లకు చేరే అవకాశముందని పేర్కొన్నారు.