Chandrababu: చంద్రబాబు దీక్షను సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుర్తించలేదు: వైసీపీ నేత దాడి వీరభద్రరావు

  • 23 మంది ఎమ్మెల్యేల్లో 8 మందే హాజరయ్యారు
  • ఇసుక దీక్ష పేరుతో చంద్రబాబు డ్రామాలు
  • ఈ దీక్షలు ప్రజలపై ప్రేమతో కాదు లోకేశ్ భవిష్యత్తు కోసమే

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షపై వైసీపీ నేత దాడి వీరభద్రరావు విమర్శలు గుప్పించారు.

విశాఖపట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విచిత్రమేంటంటే, చంద్రబాబు చేసిన దీక్షను ఆయన పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలే గుర్తించలేదని అన్నారు. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది మాత్రమే హాజరయ్యారని మిగిలిన వాళ్లు రాలేదంటే సానుకూలమైన స్పందన లేదన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఇసుక దీక్ష పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలపై ప్రేమతో కాదని, తన కొడుకు లోకేశ్ భవిష్యత్తు కోసమే ఆయన దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని భావిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేరే పార్టీ చూసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. ఇటు వైసీపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ చెబుతుండటం, అటు బీజేపీలో చేరాలంటే అక్కడి పరిస్థితి ఏంటో తెలీదని, ఇటువంటి పరిస్థితుల్లో ఒక గ్రూప్ గా తయారవ్వాలన్న భావన టీడీపీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో ‘వన్ థర్డ్ లేదా సగం మంది’ కానీ ఓ గ్రూప్ లా తయారై తమదే నిజమైన టీడీపీ అని ప్రకటించుకుని నడిచే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోందని, ఆ తర్వాత ఏదో ఒక పార్టీలో విలీనం అయిపోతారని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News