sassim rizvi: రామమందిర నిర్మాణానికి యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ విరాళం!
- రూ.51 వేల ఆర్ధిక సాయం
- అయోధ్య రాముడితో మాకూ అనుబంధం ఉంది
- అందుకే 'వసీం రిజ్వీ ఫిల్మ్' తరపున ఈ సాయం
అయోధ్య రాముడితో తమకు కూడా అనుబంధం ఉందని, అందువల్ల అక్కడ రామమందిర నిర్మాణానికి తాము అనుకూలమని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ తెలిపారు. అందుకే మందిర నిర్మాణానికి 'వసీం రిజ్వీ ఫిల్మ్' తరపున 51 వేల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిలోని బాబ్రీమసీదు స్థానంలో రామమందిరం ఉండేదని, బాబర్ కాలంలో దాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారన్న ఆరోపణలతో దశాబ్దాలుగా వివాదం నడిచిన విషయం తెలిసిందే.
ఈ వివాదానికి ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ఆ స్థలం అయోధ్య రాముడిదేనని, ప్రత్యామ్నాయంగా ముస్లింలకు అయోధ్యలోనే మరోచోట ఐదెకరాల స్థలం కేటాయించాలని తీర్పునిచ్చింది. ఈ నేపధ్యంలో రామజన్మభూమి న్యాస్ కు తానీ విరాళం అందజేస్తున్నట్లు రిజ్వీ తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం రామ భక్తులకు గర్వకారణమని వ్యాఖ్యానించారు.