vodafone idea: రూ.50,921 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న వొడాఫోన్ ఐడియా
- సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాలు
- ఆదాయంలో మాత్రం 42 శాతం పెరుగుదల
- గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,874 కోట్ల నష్టాలు
దేశంలోని ప్రముఖ టెలికం సంస్థలలో ఒకటైన వొడాఫోన్ ఐడియా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. గతేడాది ఇదే సమయంలో రూ.4,874 కోట్ల నష్టాన్ని చవిచూసిన వొడాఫోన్, ఈసారి ఏకంగా రూ.50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది. అయితే, అదే సమయంలో ఆదాయం మాత్రం 42 శాతం పెరిగి రూ.11,146 కోట్లుగా నమోదైంది.
సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వానికి వొడాపోన్ ఐడియా రూ.44,150 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంతో కలుపుకునే తాజా నష్టాన్ని ప్రకటించింది. కాగా, ఏజీఆర్‌పై ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌కు వెళ్లనున్నట్టు వొడాఫోన్ తెలిపింది. కాగా, టెలికం చరిత్రలో ఈ స్థాయిలో నష్టాలు రావడం ఇదే తొలిసారి.