Pakistan: పాకిస్థాన్ లో ఊపందుకోనున్న టెస్ట్ క్రికెట్ !
- పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడనున్న శ్రీలంక
- 2009లో బాంబుపేలుడు ఘటనతో విదేశీ జట్లు దూరం
- డిసెంబర్ లో రావల్పిండి, కరాచి వేదికలుగా రెండు మ్యాచ్ ల సిరీస్ ఖరారు
పాకిస్థాన్ లో మళ్లీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణకు ఆ దేశ క్రికెట్ బోర్డు సమయాత్తమవుతోంది. పదేళ్లుగా ఆదేశంలో టెస్ట్ మ్యాచ్ లు జరగలేదు. తాజాగా ఆ దేశంలో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు తమ జట్టును పంపించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఓకే చెప్పింది. 2009లో శ్రీలంక జట్టు ఆ దేశంలో పర్యటిస్తున్న సమయంలో బాంబుదాడి జరిగింది. అప్పటినుంచి పాకిస్థాన్ లో ఏ దేశమూ పర్యటించలేదు.
తాజాగా శ్రీలంక జట్టే మళ్లీ పాక్ లో పర్యటించడానికి సిద్ధమైంది. డిసెంబర్ 11 నుంచి 15 వరకు రావల్పిండి వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్, అదేనెల 19 నుంచి 23 వరకు కరాచీ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ను ఆతిథ్య జట్టుతో ఆడనుంది. ఈ మేరకు వివరాలను పీసీబీ డైరెక్టర్ జకీర్ ఖాన్ మీడియాకు తెలిపారు.
‘పాకిస్థాన్ క్రికెట్ కు ఇదో నమ్మశక్యంకాని వార్త. ప్రపంచంలోని ఇతరదేశాల మాదిరిగానే మా దేశం భద్రతాపరంగా సురక్షితమన్న విశ్వాసం పెరుగుతోంది. టెస్ట్ ఫార్మాట్ సీరిస్ కోసం జట్టును పంపించేందుకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.