Visakhapatnam District: విశాఖ మన్యంలో చలి పులి... ఏజెన్సీలో అప్పుడే 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత
- చింతపల్లి మండలం లంబసింగిలో నమోదు
- దట్టంగా కురుస్తున్న పొగమంచు
- ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావం
తూర్పు కనుమల్లోని విశాఖ ఏజెన్సీలో చలి మొదలయ్యింది. ఏజెన్సీ వాసుల్ని గజగజా వణికిస్తోంది. దట్టంగా కురుస్తున్న మంచుకు తోడు చలిగాలుల ప్రభావంతో స్థానికులతోపాటు ఏజెన్సీ సందర్శనకు వచ్చిన పర్యాటకులు వణికి పోతున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. పచ్చని గిరులు, మంచుతెరలు, మనల్ని ముద్దాడి వెళ్తున్న మేఘాలు పరవశింపజేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఏటా శీతాకాలంలో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
ఏజెన్సీలోని అరకులోయకు 'ఆంధ్రా ఊటీ'గా, చింతపల్లి మండలంలోని లంబసింగికి 'ఆంధ్రా కశ్మీర్'గా పేరుంది. లంబసింగిలో డిసెంబరు, జనవరి నెలల్లో అర్ధరాత్రి జీరో నుంచి మైనస్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బుధవారం రాత్రి లంబసింగిలో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం కారణంగా ఏకంగా నవంబరు రెండోవారంలోనే ఉష్ణోగ్రతలు ఏక సంఖ్యకు పడిపోయాయని నిపుణులు చెబుతున్నారు. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో ఏజెన్సీ ప్రత్యేక అందాలు సంతరించుకోవడంతో లంబసింగి, చెరువుల వేలం, అరకులోయ ప్రాంతాలకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు.