Telugudesam: ఇప్పటికీ టీడీపీ నాయకుల ఇళ్లల్లో ఇసుక గుట్టలు ఉన్నాయి: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి
- టీడీపీ హయాంలో ఇసుక విధానం అవినీతి మయం
- బాబు హయాంలో అవినీతిని సీఎం జగన్ కడిగేస్తున్నారు
- పారదర్శక విధానంలో ఇసుక సరఫరా చేస్తాం
రాష్ట్రంలో నెలకొన్న కృత్రిమ ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం రాజకీయ కారణాలతో తన తాబేదారు పవన్ కల్యాణ్ ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. టీడీపీ హయాంలో అవినీతి ఇసుక విధానం కారణంగా ఆనాటి కాంట్రాక్టర్లందరూ లక్షల టన్నుల ఇసుకను స్టోర్ చేసుకున్న విషయం వాస్తవం కాదా? ఇప్పటికి కూడా తెలుగుదేశం సానుభూతిపరులు, నాయకుల ఇళ్లల్లో ఇసుక గుట్టలు ఉన్నమాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఇటీవల జరిగిన ఒక డిబేట్ లో ఛాలెంజ్ చేస్తే ‘ఏపీ 24x7’ విలేకరులను తీసుకెళ్లి తెలుగుదేశం సానుభూతిపరులు, నాయకుల ఇళ్లల్లో ఉన్న ఇసుక గుట్టలన్నింటినీ చూపించాం’ అని అన్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న అవినీతి కంపును వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కడిగేసి, పారదర్శక విధానంలో ఇసుకను సరఫరా చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తుంటే విమర్శిస్తారా? అని ధ్వజమెత్తారు.