Andhra Pradesh: పగలు ఎండ మంట... రాత్రి వణికించే చలి... తెలంగాణలో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత!
- తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి
- హైదరాబాద్ లో 20 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
- మరింతగా తగ్గుతుందంటున్న వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొని వున్నాయి. పగటి ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీల వరకూ ఉండగా, రాత్రిపూట, ముఖ్యంగా తెల్లవారుజామున ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతోంది. వణికించే చలి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. శీతాకాలం ప్రవేశించడంతో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో చలి తీవ్రత పెరిగిందని తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణలో అప్పుడే రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోయి, చలి తీవ్రత పెరుగుతోంది. మంగళవారం నాడు తాళ్లపల్లిలో 15.5 డిగ్రీలు, మెదక్ లో 16.8 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 17 డిగ్రీలు, హైదరాబాద్ లో 20.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.