West Godavari District: రైతులకు ఇవ్వాల్సిన రూ. 2 కోట్లు ఎగ్గొట్టేందుకు వ్యాపారి పక్కా ప్లాన్.. అయినా దొరికిపోయిన వైనం!

  • పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
  • తాను హత్యకు గురైనట్టు నమ్మించే పథకం
  • కోడి రక్తాన్ని పూసి, బైక్‌ను కాలువలోకి తోసేసి అదృశ్యం

రైతులకు ఇవ్వాల్సిన రెండు కోట్ల రూపాయలను ఎగ్గొట్టేందుకు ఓ వ్యాపారి వేసిన హత్య పథకం బెడిసికొట్టింది. ఇప్పుడు పోలీసులకు చిక్కి తీరిగ్గా కటకటాలలో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కామవరపుకోట మండలం రామన్నపాలేనికి చెందిన సాయిదుర్గారావు వ్యాపారి. ఏలూరు మండలం చొదిమెళ్ల సమీపంలో ఉన్న మొక్కజొన్న ఫ్యాక్టరీ గోదాం యజమాని శ్రీనివాసరావు.. సాయిదుర్గారావుకు రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అలాగే, సాయిదుర్గారావు రైతులకు రెండు కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది.

వాటిని చెల్లించకుండా తప్పించుకునేందుకు సాయిదుర్గారావు చక్కని పథకం పన్నాడు. తాను హత్యకు గురైనట్టు నమ్మించగలిగితే శ్రీనివాసరావుపైకి అనుమానం మళ్లడంతోపాటు రైతులకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించాడు. అనుకున్నదే తడవుగా పథకాన్ని అమలు చేశాడు. ఇందులో భాగంగా గత నెల 22న తనకు రావాల్సిన డబ్బుల కోసం శ్రీనివాసరావు వద్దకు వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులతో చెప్పి బయలుదేరాడు. వెళ్తూవెళ్తూ కోడి రక్తాన్ని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద చల్లి, తన కళ్లజోడును అక్కడ పడేశాడు. ఆపై బైక్‌ను తీసుకెళ్లి ఏలూరు కాలవలోకి తోసేశాడు. అనంతరం అదృశ్యమయ్యాడు.

డబ్బుల కోసం శ్రీనివాసరావు వద్దకు వెళ్లిన సాయిదుర్గారావు తిరిగి ఇంటికి చేరుకోలేదన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. సాయి దుర్గారావు బతికే ఉన్నాడని, అతడి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాడని నిర్ధారించుకుని కాపుకాశారు. నిన్న ఏలూరు శివారులోని జాతీయ రహదారిపై సాయి దుర్గారావును అరెస్ట్ చేశారు.

West Godavari District
Eluru
murder plan
Crime News
  • Loading...

More Telugu News