Shashi Tharoor: పుస్తక పఠనంతోనే ఆంగ్ల పదాలపై పట్టు దొరికింది: కాంగ్రెస్ నేత శశిథరూర్
- విద్యార్థి అడిగిన ప్రశ్నకిచ్చిన సమాధానం ట్విట్టర్లో వైరల్
- డిక్షనరీలు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించానని వెల్లడి
- చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివేవాడ్నన్న థరూర్
కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆంగ్ల భాషపై తనకున్న పట్టుకు కారణం చిన్నప్పటినుంచి పుస్తకాలు చదవటమేనని చెప్పారు. థరూర్ కున్న ఒకాబ్యులరీ పరిజ్ఞానంపై సామాజిక మాధ్యమాల్లో సరదా వ్యాఖ్యానాలు కన్పిస్తుంటాయి. ఏదైనా పదానికి అర్ధం తెలియకపోతే.. 'డిక్షనరీ చూడాలి లేదా శశిథరూర్ ను అడగాలి' అని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. ఇటీవల ఒక 10వ తరగతి విద్యార్థి ఇదే సందేహాన్ని థరూర్ ను అడిగాడు. దీనికి థరూర్ జవాబిచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
‘చాలా మంది నన్ను వేరుగా భావిస్తారు. రోజంతా ఇంట్లో కూర్చుని డిక్షనరీలు తిరగేస్తాననుకుంటారు. నిజమేమిటంటే, నా జీవితంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే డిక్షనరీలను ఉపయోగించాను. అయితే చాలా పుస్తకాలు చదివాను. ఫలితంగా నా ఒకాబ్యులరీ పెరిగింది. చిన్నప్పుడు ఆస్తమాతో ఇబ్బంది పడ్డాను. దాంతో ఇంట్లోనే ఉండేవాడ్ని. అప్పుడు పుస్తకాలే నాకు సర్వస్వం అయ్యాయి. టీవీలు, మొబైల్స్ లేకపోవడంతో పుస్తకాలపై దృష్టి నిలిచింది. విద్యార్థులకు ఇచ్చే సలహా ఒక్కటే.. సాధ్యమైనన్నీ పుస్తకాలు చదవండి. ఒకాబ్యులరీ పెరుగుతుంది’ అని చెప్పారు.