New Delhi: హాస్టల్ ఫీజు పెంపుపై నిరసన.. ఢిల్లీ జేఎన్ యూ వద్ద ఉద్రిక్తత... ఉపరాష్ట్రపతిని అడ్డుకునేందుకు ముందుకురికిన విద్యార్థులు

  • హాస్టల్ ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థుల నిరసన
  • వైస్ చాన్సలర్ సమాధానం చెప్పడంలేదంటూ ఆరోపణ
  • జేఎన్యూ వద్ద పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వద్ద ఈ ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హాస్టల్ ఫీజును ఒక్కసారిగా 300 శాతం పెంచడంపై విశ్వవిద్యాలయం అధికార వర్గాలు సమాధానం ఇవ్వాల్సిందేనని విద్యార్థులు తీవ్ర నిరసనకు ప్రయత్నించారు. ఇన్నాళ్లూ నెలకు రూ.2500 ఉన్న ఫీజును ఒక్కసారిగా రూ.7500కు పెంచారని, విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ మామిడాల జగదీశ్ కుమార్ వివరణ ఇవ్వకుండా, చర్చలకు నిరాకరిస్తున్నారంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో క్యాంపస్ ఎదుట గుమికూడారు.

ఓవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తుండగా ఆయన్ను అడ్డుకునేందుకు విద్యార్థులు ఒక్కసారిగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిపై వాటర్ కేనన్లు ప్రయోగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులని కూడా చూడకుండా పోలీసులు తమపై జులుం ప్రదర్శిస్తున్నారని జేఎన్యూ విద్యార్థులు వాపోయారు.

  • Loading...

More Telugu News