Nara Lokesh: రోజుకు మూడు కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తున్నప్పుడే జగన్ పై అనుమానం వచ్చింది: నారా లోకేశ్
- సీఎం జగన్ లక్ష్యంగా లోకేశ్ విమర్శలు
- జగన్ ముఠా క్విడ్ ప్రో కో స్కెచ్ వేస్తోందంటూ ఆరోపణ
- ప్రభుత్వ ఆస్తులు అమ్మితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. మిషన్ క్విడ్ ప్రో కో మళ్లీ ప్రారంభమైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని ట్విట్టర్లో ఆరోపించారు. విలువైన ప్రభుత్వ ఆస్తులు కొట్టేయడానికి జగన్ క్విడ్ ప్రో కో కంపెనీ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు.
జగన్ గారు ఓ యువకుడై ఉండి పాదయాత్రలో కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే నడుస్తున్నప్పుడే అనుమానం వచ్చిందని, ఇప్పుడా అనుమానం నిజమైందని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో జగన్ గారు ప్రభుత్వ స్థలాల సర్వే పూర్తిచేశారని ఆరోపించారు. ఇప్పటికే వలంటీర్ల పేరుతో ఏడాదికి రూ.4000 కోట్ల ప్రజాధనం లూటీ చేస్తూ, మరోవైపు ప్రభుత్వ ఆస్తులు కూడా అమ్మేస్తాం అంటే చూస్తూ ఊరుకోబోము అని హెచ్చరించారు.