Vijay Sai Reddy: అన్నీ ఈ వ్యాధి లక్షణాలే.. వాళ్లు మాత్రం ఏమి చేస్తారు పాపం!: విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు

  • జగన్ కి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందన్న బుద్ధా వెంకన్న
  • అందుకే ఇలా అయిపోయారు విజయసాయిరెడ్డి గారూ
  • ప్రజల్ని దోచుకోవడం, విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలన్నా వెంకన్న 

తర్కానికందని కోతలు కోస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. 'తుపాను ఎక్కడ తీరం దాటేది నాకు ముందే తెలుసు. హైదరాబాద్ ను  నేనే నిర్మించా. నా విజన్-2020 డాక్యుమెంటును అబ్దుల్ కలామ్ కాపీ కొట్టారు' అని ఒకరు కోతలు కోస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. 'సూడోలాజియా ఫెంటాస్టికా (pseudologia fantas´tica) అనే మానసిక రుగ్మత వల్లే ఇలా అయిపోయారు పాపం. తర్కానికందని కోతలు కోయడం దీని లక్షణమే' అని ఎద్దేవా చేశారు.

విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. 'యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధి వలనే జగన్ గారు, మీరు ఇలా అయిపోయారు విజయసాయిరెడ్డి గారూ. అబద్ధాలు చెప్పడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజల్ని దోచుకోవడం, విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు' అని ఎద్దేవా చేశారు.
 
'డెంగ్యూతో ప్రజలు చస్తుంటే సంబరాలు చేసుకోవడం, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జోకులు వెయ్యడం, 45 ఏళ్లకే పెన్షన్ అని మహిళలను మోసం చెయ్యడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మేయడం, సొంత వారిని లేపేయడం అన్నీ ఈ వ్యాధి లక్షణాలే.. వాళ్లు మాత్రం ఏమి చేస్తారు పాపం' అని మరో ట్వీట్ లో బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Vijay Sai Reddy
budda venkanna
Telugudesam
  • Loading...

More Telugu News