shamshabad: శంషాబాద్‌లో ఆ విమానాన్ని ఆపేసింది ఎలుకేనట!
- విమానంలో దూరిన ఎలుక
- పది గంటలకుపైగా శ్రమించి పట్టుకున్న సిబ్బంది
- ఉదయం 6:10 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాయంత్రం 5:30కి టేకాఫ్
శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న విశాఖపట్టణం వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 11:30 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. అయితే, విమానం ఆలస్యం కావడానికి కారణం ఏంటన్నది తాజాగా బయటపడింది. చిన్న ఎలుక వల్లే విమానం అన్ని గంటలు ఆలస్యమైనట్టు తేలింది.
విమానంలో ఎలుక దూరిన విషయాన్ని గమనించిన సిబ్బంది ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో దానిని పట్టే వరకు విమానాన్ని నిలిపివేశారు. పది గంటలకుపైగా శ్రమించిన సిబ్బంది ఎట్టకేలకు దానిని పట్టుకున్నారు. దీంతో ఉదయం 6:10 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరింది. విమానంలో మొత్తం 250 మంది ప్రయాణించాల్సి ఉండగా, వారిలో 50 మంది టికెట్లు రద్దు చేసుకుని వెళ్లిపోయారు.