East Godavari District: పరువు తీసిన టిక్‌టాక్ వీడియో.. అవమానభారంతో కువైట్‌లో ఆత్మహత్య చేసుకున్న రాజోలు యువకుడు!
- ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లిన యువకుడు
- చిట్టీ డబ్బులతో కనిపించకుండా పోయాడంటూ స్నేహితుల వీడియో
- మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకున్న మోహన్‌కుమార్
వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌లో తనపై తప్పుడు వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్‌లో ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడుకు చెందిన పుచ్చకాయల మోహన్‌కుమార్ (30) రెండేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ దుకాణంలో పనికి కుదిరాడు. సంపాదించిన సొమ్ములో కొంత చిట్టీ కడుతున్నాడు. ఇటీవల ఆ చిట్టీని పాడుకున్నాడు.
అయితే, చిట్టీ పాడుకున్న మోహన్ ఆ డబ్బు తీసుకుని కనిపించకుండా పోయాడంటూ అతడి స్నేహితులు కొందరు మోహన్ ఫొటోలతో ఓ వీడియో తయారుచేసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారు. అది చూసి తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్ ఈ నెల 3న తాను ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ మృతదేహం నిన్న స్వగ్రామం చేరుకుంది. మోహన్ ఆత్మహత్యపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.