BJP: బీజేపీ అయిపోయింది, ఇప్పుడు శివసేన వంతు... ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరిన గవర్నర్
- మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
- శివసేనకు గవర్నర్ కు ఆహ్వానం
- రేపటివరకు గడువు
మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్న ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బీజేపీని కోరిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తాజాగా శివసేనకు ఆహ్వానం పలికారు. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని, అందుకు అవసరమైన సంఖ్యాబలం తమకు లేదని బీజేపీ తేల్చి చెప్పిన నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ శివసేన పార్టీని కోరారు. రేపు రాత్రి 7.30 గంటల్లోగా నిర్ణయం తెలపాలని శివసేనకు సూచించారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో 56 మంది ఎమ్మెల్యేలతో రెండో అతిపెద్ద పార్టీగా శివసేన కొనసాగుతోంది. బీజేపీతో సీఎం కుర్చీపై ఒప్పందం కుదరని కారణంగా ఇప్పుడు శివసేన చూపు కాంగ్రెస్, ఎన్సీపీలపై పడింది.
మ్యాజిక్ ఫిగర్ 145 కాగా, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ 105 స్థానాలతో పెద్ద పార్టీగా ఉన్నా సమీకరణాలు కలిసిరాకపోవడంతో విపక్షంగా ఉండేందుకు సిద్ధపడింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే.