Hyderabad: హైదరాబాద్ లో విషాదం... ఫంక్షన్ హాల్ గోడకూలి నలుగురి దుర్మరణం
![](https://imgd.ap7am.com/thumbnail/tn-31dda57794df.jpg)
- అంబర్ పేటలో కుప్పకూలిన ఫంక్షన్ హాల్ గోడ
- మృతుల్లో ఒకరు మహిళ
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్ హాల్ గోడకూలిపోయిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అంబర్ పేట్ గోల్నాకలో ఉన్న పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఈ ఘోరం జరిగింది. లోపల ఓ వివాహం జరుగుతున్న సమయంలో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య, సొహెయిల్, సురేశ్, విజయలక్ష్మి మరణించగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మృతుల కుటుంబాలకు జీహెచ్ఎంసీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
కాగా, ఈ ఘటనలో పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఇటీవలే పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ కు మరమ్మతులు నిర్వహించగా, ఇవాళే పునఃప్రారంభమైంది. అంతలోనే ప్రమాదం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-13f0dcba4e6c8c7290996144c1ce4df3742aa937.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-c22c1fb58a82c6a45be1a254c90667840167ed7d.jpeg)