Budda Venkanna: హామీలు నెరవేర్చే దమ్ములేక ఇలాంటి దద్దమ్మ కబుర్లెందుకు?: బుద్దా వెంకన్న
- 'మంగళవారం ముఖ్యమంత్రి' అని ఒప్పుకున్నారని ఎద్దేవా
- బ్యాంకులు ఛీ అంటున్నాయని వ్యాఖ్యలు
- రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతారా? అంటూ నిలదీసిన బుద్దా
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు సీఎం గారిని 'శుక్రవారం ముఖ్యమంత్రి' అనుకున్నామని, కానీ ఇప్పుడాయన 'మంగళవారం ముఖ్యమంత్రి' అని మీరే ఒప్పుకున్నారని, అందుకు ధన్యవాదాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ములేక రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్నారని, ఇలాంటి దద్దమ్మ కబుర్లు ఎందుకు? అంటూ మండిపడ్డారు.
చంద్రబాబు గారి హయాంలో ఏడాదికి రూ.22 వేల కోట్లు అప్పు చేస్తే, జగన్ గారి పాలనలో ఐదు నెలల్లోనే రూ.18 వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా బడ్జెట్లో రూ.48 వేల కోట్లు అప్పు ప్రతిపాదించారని విమర్శించారు. ఎవరు ఎక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారో ఇప్పుడు చెప్పండి లెక్కల మాస్టారూ అంటూ విజయసాయిరెడ్డిని నిలదీశారు. మీ దొంగ ముఖాలు చూసి బ్యాంకులు ఛీ అంటున్నా, సిగ్గులేకుండా మీ తప్పుడు లెక్కలే నిజం అంటారా? అని విమర్శించారు.
"చంద్రబాబు తలపెట్టిన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుని వంకర రోడ్డుగా మార్చింది మీ మహానేతే విజయసాయి గారూ. ఆపై మహానేత, యువనేత కలిసి తమ మందీమార్బలంతో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.5500 కోట్ల నుంచి రూ.35 వేల కోట్లకు పెంచి ఆస్తులు కూడబెట్టింది నిజం కాదా?" అని బుద్దా వెంకన్న ట్విట్టర్ లో ప్రశ్నించారు.