Wine: వైన్ వినియోగం గురించి వివరాలు ఇవిగో..!

  • బ్లాక్ బెర్రీ, వోట్స్ తో తయారైన వైన్ కు ఔషధ లక్షణాలు
  • రెడ్ వైన్ కూడా మంచిదేనంటున్న నిపుణులు!
  • పరిమితంగా తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయంటున్న అధ్యయనాలు

ఒకప్పుడు ఉన్నతస్థాయి వర్గాలకు మాత్రమే పరిమితమైన వైన్ ఇప్పుడు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటోంది. చాలా కంపెనీలు ధరలు తగ్గించడమే అందుకు కారణం. ధరల్లో వ్యత్యాసాన్ని బట్టి నాణ్యతలో తేడా ఉంటుంది. అసలు విషయానికొస్తే, కొన్ని అధ్యయనాలు వైన్ తాగితే కాలేయం చెడిపోతుందని చెబుతాయి. ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనంలో మాత్రం వైన్ దివ్యమైనదని అంటున్నారు.

అయితే ఆ వైన్ బ్లాక్ బెర్రీ పండ్లు, వోట్స్ తో తయారైనదయితే శరీర ఆరోగ్యానికి అద్భుతంగా దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ తరహా వైన్ లో ఉండే కార్బొనేట్ దేహ జీవక్రియలు సవ్యంగా సాగేందుకు ఉపకరిస్తుందట. ఇక, వైట్ వైన్, రెడ్ వైన్ కూడా మంచివేనని, రెడ్ వైన్ కారణంగా హృద్రోగ మరణాల ముప్పు తగ్గుతుందని అనేక అధ్యయనాల సారాంశం.

ముఖ్యంగా చర్మం ముడతలు పడనివ్వకుండా నిత్యం నవయవ్వనంతో ఉండేట్టు చేస్తుందట. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ చర్మకణాలను సజీవంగా ఉంచడంలో సాయపడతాయి. మధుమేహ వ్యాధి ఉన్నవాళ్లు సైతం ఈ వైన్ ను భేషుగ్గా తీసుకోవచ్చని, వారిలో గుండె జబ్బుల బారినపడే శాతం తక్కువగా ఉంటుందని మరో అధ్యయనం చెబుతోంది.

ఏదేమైనా, అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. తగు మోతాదును మించి తీసుకుంటే వైన్ అయినా సరే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే పరిమితంగా తీసుకుంటేనే వైన్ శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Wine
Heart
Red WIne
Liver
  • Loading...

More Telugu News