Babri masjid: బాబ్రీ మసీదు కూల్చివేస్తుంటే అప్పటి ప్రధాని పీవీ చేష్టలుడిగి చూశారా ? : ఇప్పటికీ ఆయనపై తొలగని మచ్చ
- ప్రధానిగా దాన్ని నిలువరించలేకపోయారని విమర్శలు
- కేంద్ర హోంశాఖ హెచ్చరించినా పట్టించుకోలేదన్న వాదన
- మాధవ్ గోడ్బోలే తన పుస్తకంలో వెల్లడి
అయోధ్య అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా రాజకీయ చాణుక్యుడు, మేధావిగా గుర్తింపు పొందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ప్రస్తావన రావడం సహజం. కరసేవకులు బాబ్రీమసీదు కూల్చివేసిన సమయానికి పీవీ దేశ ప్రధానిగా ఉండడమే ఇందుకు కారణం. సునిశిత రాజకీయ నాయకునిగా, లౌకిక భావాలున్న వ్యక్తిగా పేరున్న పీవీ బాబ్రీ మసీదు వంటి చారిత్రక కట్టడం కూల్చివేసే ప్రమాదం ఉందని తెలిసినా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారన్న ఆరోపణలున్నాయి.
ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేసే అవకాశం ఉందని పీవీ ముందే ఊహించినా తగిన చర్యలు తీసుకోలేదన్నది ప్రధాన ఆరోపణ. ఆ ఘటన జరిగిన సమయానికి ప్రధానిగా ఉన్న పీవీ ఎలా వ్యవహరించారన్న అంశాలపై ఆయన హయాంలో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మాధవ్ గాడ్బోలే రాసిన ‘ది బాబ్రీ మసీద్-రాం మందిర్ డైలమా : యాన్ యాసిడ్ టెస్ట్ ఫర్ కానిస్టిట్యూషన్' అనే పుస్తకంలో చాలా కీలక విషయాలు బయటపెట్టారు.
ఇందులోని అంశాల ప్రకారం బాబ్రీ మసీదు కూల్చివేసే ప్రమాదాన్ని నివారించేందుకు కేంద్ర హోం శాఖ పక్కా ప్రణాళిక రూపొందించింది. ఏదైనా దుర్ఘటన జరిగే అవకాశం ఉంటే కేంద్ర పారామిలటరీ దళాలను మసీదు ప్రాంతానికి పంపి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకోవాలన్నది ఆ ప్రణాళిక ఉద్దేశం. కానీ ఈ ప్రణాళికను పీవీ తోసిపుచ్చారని, దీంతో కేంద్రం ఏమీ చేయలేకపోయిందన్నది గాడ్బోలే అభిప్రాయం.
‘ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను పీవీ గుడ్డిగా నమ్మడం వల్లే ఈ పరిణామం ఉత్పన్నమయిందని’ సీతాపతి రాసిన 'నరసింహుడు' పుస్తకంలో ప్రస్తావించి ఉండడం గాడ్బోలే వాదనకు కొంత బలం చేకూరుస్తున్నాయి. అయోధ్య సమస్య పరిష్కారానికి ఓ వేదిక ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలన్నది పీవీ ఆలోచన అని, ఇందుకోసం ఈ దిశగా చర్చలు జరిగిన సందర్భాల్లో బాబ్రీని కూల్చివేయవద్దంటూ ఆయన పదేపదే కోరేవారని చెబుతారు.
పీవీ నాగ్‌పూర్‌లో చదువుకోవడం, సమీపంలోని రామ్‌టెక్ నుంచి పార్లమెంటుకు ఎన్నిక కావడం మూలంగా ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పైగా, బాబ్రీ ఘటన సమయంలో వాజ్‌పేయ్ కంటే సమస్య పరిష్కారానికి అద్వానీయే సమర్థుడని పీవీ నమ్మారంటారు. ఇందుకోసం ఆయనతో పలుమార్లు సమావేశమై సమాలోచన జరిపారని చెబుతారు.
ఇన్ని చేసినా బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలక భూమిక పోషించిన భజరంగదళ్, శివసేనలను పీవీ సంప్రదించ లేదు. ఇందుకు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలు తమ మిత్రులను నియంత్రించగలరన్న పీవీ నమ్మకమే కారణం. కానీ పీవీ నమ్మకాలు నిజం కాలేదు. ఆయన విశ్వసించిన శక్తుల సహకారం అక్కరకు రాలేదు.
1992, డిసెంబర్ 6న కరసేవకుల చర్య కారణంగా మధ్యాహ్నం గం1.55లకు గుమ్మటం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పీవీ ఉద్దేశపూర్వకంగా భాగస్వామి అయిన వ్యక్తి కాదు. కానీ ఆయనపై చెరగని మచ్చ అలాగే ఉండిపోయింది.