Vajpayee: వాజ్ పేయి భారీ విగ్రహం సిద్ధం... విశేషాలు ఇవే!
- జైపూర్ లో తయారవుతున్న విగ్రహం
- డిసెంబర్ నాటికి పూర్తి
- లక్నోలో ప్రతిష్ఠాపన
మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి భారీ శిలా విగ్రహం జైపూర్ లో తయారైంది. సుమారు 25 అడుగులు ఎత్తున ఉండే ఈ విగ్రహానికి ప్రస్తుతం తుదిరూపునిస్తున్నారు. మరో నెలన్నరలో ఈ పనులు పూర్తి కానుండగా, ఆపై ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు తరలించి, అక్కడ ప్రతిష్టించనున్నారు.
ఇక విగ్రహం ఎన్నో ప్రత్యేకతలతో తయారవుతోంది. కంచుతో పాటు ఇతర లోహాల మిశ్రమాన్ని ఈ విగ్రహం తయారీలో వినియోగించారు. ప్రముఖ శిల్ప కళాకారుడు రాజ్ కుమార్ పండిత్ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. బీహార్ లోని నలందకు చెందిన రాజ్ కుమార్ 20 సంవత్సరాల క్రితమే జైపూర్ కు వచ్చి స్థిరపడ్డారు. వాజ్ పేయి విగ్రహం తయారీ అవకాశం తనకు దక్కడంపై ఆయన స్పందిస్తూ, తనకెంతో నచ్చిన నేత ఆయనని, ఆయన ప్రసంగాలు వింటూ పెరిగానని అన్నారు. వాజ్ పేయి నిత్యమూ ధరించే పంచెకట్టు, లాల్చీ, షూస్ తో ఈ విగ్రహం కనిపిస్తుందని, ఎన్నో వాజ్ పేయి చిత్రాలను పరిశీలించిన తరువాతనే విగ్రహం ఆకారాన్ని రూపొందించామని ఆయన అన్నారు.