USA: చైనాతో ఎలాంటి డీల్ కుదరలేదు: బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్
- ఎలాంటి డీల్ కుదరలేదు
- నేనేంటో చైనాకు తెలుసు
- పన్నుల ఎత్తివేతపై చర్చలే జరగలేదు
- యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
రెండు అగ్రరాజ్యాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడిందన్న ఆనందం మూనాళ్ల ముచ్చటే అయింది. అమెరికా, చైనాల మధ్య డీల్ కుదిరిందని, దీని ప్రకారం సమ నిష్పత్తిలో మాత్రమే పన్నులు ఉంటాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిని ఖండించారు. చైనా ఉత్పత్తులపై పన్నులు ఎత్తివేసేలా ఎలాంటి ఒప్పందమూ కుదరలేదని సంచలన ప్రకటన చేశారు.
కాగా, ఒకరి వస్తువులపై ఒకరు వేసుకుంటున్న పన్నులను వెనక్కు తీసుకునేందుకు రెండు దేశాల ప్రతినిధులూ అంగీకరించారని చైనా వెల్లడించిన సంగతి తెలిసిందే. సుంకాల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చైనా కోరుకుందే తప్ప, పూర్తిగా పన్నుల ఎత్తివేతపై చర్చలు జరగలేదని ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఎటువంటి వాడినో చైనాకు తెలుసునని, తానింకా ఎలాంటి డీల్ కూ ఓకే చెప్పలేదని అన్నారు. ట్రంప్ తాజా ప్రకటనతో వాణిజ్య వర్గాలు, ముఖ్యంగా ఇన్వెస్టర్లలో మరోసారి ఆందోళన మొదలైంది.