Advani: నా దశాబ్దాల కల నెరవేరిన క్షణాలివి: అద్వానీ
- చరిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు
- కోట్లాది మంది నమ్మకాలను నిలబెట్టిన తీర్పిది
- అన్ని వర్గాలూ ఒక్కటై సమగ్రతను బలపరచాలన్న అద్వానీ
శతాబ్దాల అయోధ్య సమస్యను పరిష్కరిస్తూ, నిన్న సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పుపై బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ స్పందించారు. ఈ తీర్పుతో హిందువుల చిరకాల కోరికైన అయోధ్య రామమందిర నిర్మాణ కల సాకారం కానుందని అన్నారు. తన దశాబ్దాల కల నెరవేరిందని, భారత సాంస్కృతిక, వారసత్వ సంపదలో రామజన్మభూమిది ప్రత్యేకమైన స్థానమని అన్నారు.
కోట్లాది మంది నమ్మకాలను నిలుపుతూ వచ్చిన ఈ తీర్పు తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఇకపై ఎటువంటి హింసకూ తావులేకుండా శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సి వుందని అద్వానీ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలూ ఒక్కటై దేశ ఐక్యతను, సమగ్రతనూ బలపరచాలని కోరారు. మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పునూ అద్వానీ స్వాగతించారు.