Pakistan: పాక్ నేతల నుంచి మరోసారి విచిత్ర వ్యాఖ్యలు!
- కర్తార్ పూర్ కారిడార్ నేడు ప్రారంభం
- హాజరైన సిద్ధూ
- విచిత్ర భాష్యం చెప్పిన పాక్ సెనేటర్
ఈమధ్య కాలంలో పాకిస్థానీ నేతలు చిత్రవిచిత్రంగా మాట్లాడడం పరిపాటిగా మారింది. అప్పట్లో బాలాకోట్ దాడుల సందర్భంగా, ఓ పాక్ మంత్రి "చీకటిగా ఉంది, లేకపోతేనా... భారత్ కు దీటుగా బదులిచ్చేవాళ్లం" అంటూ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం జర్మనీ, జపాన్ సరిహద్దులు పంచుకుంటున్నాయంటూ తప్పులో కాలేశారు. ఇప్పుడు పాక్ సెనేటర్ ఫైజల్ జావెద్ ఖాన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి విస్మయానికి గురిచేశాడు.
అసలు విషయం ఏంటంటే, ఇవాళ పాకిస్థాన్ లో కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేత అయిన సిద్ధూకు పాక్ ప్రధాని ఇమ్రాన్ తో మంచి స్నేహం ఉంది. అంతేకాకుండా సిద్ధూ ఓ సిక్కు కావడంతో సందర్భోచితంగా ఉంటుందని సిద్ధూకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. దాంతో సిద్ధూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాక్ సెనేటర్ ఫైజల్ మాట్లాడుతూ, పాక్ కు సిద్ధూ స్నేహితుడి లాంటి వాడని, సిద్ధూ టెస్టుల్లో 9 సెంచరీలు చేసినా వాటిలో ఒక్కటి కూడా పాకిస్థాన్ పై చేయలేదని తెలిపాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ పై ప్రేమ ఉండడం వల్లే సిద్ధూ పాక్ జట్టుపై సెంచరీ సాధించలేదని భాష్యం చెప్పాడు. గతంలో పాక్ పర్యటనకు వచ్చిన భారత జట్టులో సిద్ధూ కూడా సభ్యుడని, ఆ టూర్ లో సిద్ధూ ఓ ఇన్నింగ్స్ లో సెంచరీ చేయకుండా 97 పరుగుల వద్ద అవుటవ్వడమే ఇమ్రాన్ పై అభిమానానికి నిదర్శనం అని ఫైజల్ వ్యాఖ్యానించాడు.