Chalo Tank bund: ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఉద్రిక్తత.. అరెస్టులు
- సకల జనుల సామూహిక దీక్షకు తరలిన కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు
- ఇప్పటివరకు 300మంది అరెస్టు
- ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా వీహెచ్, సీపీఐ నారాయణ అరెస్టు
తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ, ప్రతిపక్షాలు ఇచ్చిన ‘సకల జనుల సామూహిక దీక్ష’ పిలుపు నేపథ్యంలో చేపట్టిన ‘ఛలో ట్యాంక్ బండ్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున మహిళా కార్మికులు, ఓయూ జేఏసీ, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనలో పాలుపంచుకోవడానికి కదిలారు.
మరోవైపు దీక్షను భగ్నం చేయడానికి భారీ ఎత్తున పోలీసులు ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం మోహరించింది. అయినప్పటికీ పలు పార్టీల నేతలు, కార్మికులు బారీకేడ్లను ఛేదించుకుని వందలాది మంది ట్యాంక్ బండ్ పైకి ప్రవేశించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇప్పటివరకు సుమారు 300కు పైగా కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఎంబీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ కు వస్తోన్న సీపీఎం నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వీరభద్రం, జూలకంటి విమలక్క తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ట్యాంక్ బండ్ కు చేరుకునే అన్ని దారులను మూసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి వచ్చే కార్మికులను, ఓయూ నుంచి వచ్చే విద్యార్థులను అడ్డుకునేందుకు పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావును హిమాయత్ నగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖైరతాబాద్ వద్ద సీపీఐ నేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.