Buddhavenkanna: 'దగా యాత్ర'లో ఇచ్చిన హామీ నెరవేర్చండి: ఏపీ సర్కారుపై బుద్ధా వెంకన్న విమర్శలు
- ఆస్తులు కొనడానికి ముందుకొచ్చిన కంపెనీలను స్వయంగా బెదిరించారు
- అగ్రి గోల్డ్ గాయాన్ని పుండు చేసి ఆయింట్మెంట్ రాస్తున్నారు
- వారంలో రూ.1,150 కోట్లు విడుదల చేయించండి విజయసాయి రెడ్డి
అగ్రి గోల్డ్ బాధితుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనబర్చుతోన్న తీరుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారంటూ వైసీపీ చేస్తోన్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 'ఆస్తులు కొనడానికి ముందుకొచ్చిన కంపెనీలను తమరు స్వయంగా బెదిరించారు గుర్తులేదా? అగ్రి గోల్డ్ గాయాన్ని పుండు చేసి ఆయింట్మెంట్ రాస్తున్నట్టు ఆ బిల్డ్అప్ లు ఆపండి. చిత్తశుద్ధి ఉంటే దగా యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వారంలో రూ.1,150 కోట్లు జగన్ గారితో విడుదల చేయించండి విజయసాయి రెడ్డి గారు' అని డిమాండ్ చేశారు.
'ఎటెట్టా ప్రజా దగా యాత్రలో ఇచ్చిన హామీని జగన్ గారు నిలబెట్టుకున్నారా? చంద్రబాబు గారు కేటాయించిన రూ.363 కోట్లలో కోత పెట్టి రూ.264 కోట్లు మాత్రమే ఇచ్చారు. విజయవాడ, హైదరాబాద్ హోటల్స్ లో కూర్చొని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా కేసులు వేయించిన విషయం మర్చిపోయారా?' అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.