Maharashtra: ద్వారాలు మూసుకుపోలేదు.. అవసరమైతే ఎన్సీపీ మద్దతు తీసుకుంటాం: బీజేపీ సంచలన వ్యాఖ్యలు

  • సంఖ్యాబలం లేకపోతే ప్రభుత్వ ఏర్పాటు కోసం యత్నించం
  • 2014లో మాకు ఎన్సీపీ సహకరించింది
  • 56 సీట్లను మాత్రమే గెలుచుకున్న శివసేన సీఎం పదవి కోసం పట్టుబట్టడం సరికాదు

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ద్వారాలు మూసుకుపోలేదని బీజేపీ వ్యాఖ్యానించింది. బీజేపీకి చెందిన ఓ కీలక నేత, రాష్ట్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అవసరమైతే మద్దతు కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కలుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైనంత సంఖ్యాబలం లేకపోతే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నించకూడదని తమ పార్టీ నాయకత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇతరుల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం బీజేపీకి లేదనే విషయం తమకు తెలుసని అన్నారు. శివసేన తమకు మద్దతిస్తుందనే నమ్మకం ఇప్పటికీ ఉందని చెప్పారు.

2014లో బీజేపీకి ఎన్సీపీ సహకరించిందని... ఈ నేపథ్యంలో, ఆ పార్టీ మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. తమ ప్రయత్నాలు విఫలమైతే... ప్రభుత్వ ఏర్పాటుకు తాము యత్నించమని చెప్పారు. బలపరీక్షలో ఓడిపోతే చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని... అది తమకు ఇష్టం లేదని తెలిపారు.

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేనను ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించామని ఆయన చెప్పారు. కానీ ఆ పార్టీ నుంచి సరైన స్పందన రాలేదని తెలిపారు. మొత్తం 288 స్థానాలకు గాను 56 సీట్లను మాత్రమే గెల్చుకున్న శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడం సరికాదని అన్నారు.

ప్రభుత్వ ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను గవర్నర్ పరిశీలిస్తారని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ తొలుత అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఆహ్వానిస్తారని, ఆ తర్వాత సంఖ్యాబలం ఆధారంగా ఇతర పార్టీలకు అవకాశం ఇస్తారని తెలిపారు. ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పక్షంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేస్తారని చెప్పారు.

Maharashtra
BJP
Shivsena
NCP
  • Loading...

More Telugu News