Srikakulam District: అన్యాయం చేశారంటూ ‘స్పందన’ సభలో తహసీల్దార్‌పై రైతుల ఆగ్రహం.. కంటతడి పెట్టిన అధికారి
- రైతు భరోసాలో తమ పేర్లు చేర్చలేదంటూ ఆగ్రహం
- స్పీకర్ తమ్మినేని తనయుడు సమక్షంలోనే ఘటన
- రైతులకు సర్దిచెప్పి తహసీల్దార్‌కు క్షమాపణ చెప్పించిన సీతారాం కొడుకు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన ‘స్పందన’ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సభకు హాజరైన తహసీల్దార్ టి.రామకృష్ణ పై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
వివరాల్లోకి వెళితే... పొందూరు మండలం కింతలి గ్రామంలో నిన్న ‘స్పందన’ సభ జరిగింది. ఈ సభకు తహసీల్దార్‌తోపాటు స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు వెంకట చిరంజీవినాగ్ కూడా హాజరయ్యారు.
ఈ సభకు వచ్చిన 70 మంది రైతులు రైతు భరోసా ప్రయోజనం పొందే విషయంలో తహసీల్దార్ తమకు అన్యాయం చేశారంటూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం వల్లే రెవెన్యూ అధికారులపై ప్రజలు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల తీరుతో ఉక్కిరిబిక్కిరైన తహసీల్దార్ స్పీకర్ తనయుని వద్దకు వెళ్లి విషయం మొరపెట్టుకుంటూ కంటతడిపెట్టారు.
దీంతో వెంకట చిరంజీవి జోక్యం చేసుకుని రైతులకు సర్దిచెప్పారు. ‘ఈ విషయమై నాన్న అధికారులతో మాట్లాడారు. నిబంధనల మేరకు పత్రాలు సమర్పించిన వారికి అధికారులు న్యాయం చేస్తారు’ అంటూ భరోసా ఇవ్వడంతో రైతులు తహసీల్దార్‌కు క్షమాపణ చెప్పి వెనుదిరిగారు.