TSRTC: అధికారులతో సమీక్షలు మాని, మాతో చర్చలకు దిగండి: సీఎం కేసీఆర్ కు అశ్వత్థామరెడ్డి అభ్యర్థన
- హైకోర్టు సూచనమేరకు 11లోపు చర్చలకు పిలవాలి
- గంటన్నరలో పరిష్కారం దొరుకుతుంది
- 9న మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం
తెలంగాణలో సమ్మె బాటపట్టిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఈనెల 11లోపు సమస్యను పరిష్కరించాలని హైకోర్టు సూచించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షలు జరిపేకంటే జేఏసీ నేతలతో గంటన్నర పాటు చర్చలు జరిపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈరోజు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరిగిన విచారణ అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు.
మూడున్నరగంటలపాటు సాగిన విచారణలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు సాగాయన్నారు. ప్రభుత్వం తరఫున హాజరైన ఐదుగురు ఐఏఎస్ అధికారులు సమర్పించిన ఆర్టీసీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన నివేదికల పట్ల కోర్టు తీవ్రంగా ఆక్షేపించిందన్నారు. హైకోర్టును కూడా మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించిందన్నారు. ఐఏఎస్ అధికారులు కూడా ఇలా చెబుతారని అనుకోలేదని కోర్టు పేర్కొందని ఆయన చెప్పారు.
తమ డిమాండ్లు నెరవేరేంతవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. సీఎం కేసీఆర్ తమను ఈనెల 11లోపు చర్చలకు పిలవాలని ఆయన అభ్యర్థించారు. ఆర్టీసీ కార్మికులు పట్టు సడలించకుండా ధైర్యంతో సమ్మెను కొనసాగించాలని పిలుపునిచ్చారు. 9న ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామని ప్రజలు భారీసంఖ్యలో పాల్గొనాలని కోరారు.