Gold: యువతుల కడుపులో బంగారం... విమానాశ్రయం పోలీసులు పట్టుకుంటే, కిడ్నాప్ చేసిన గోల్డ్ స్మగ్లర్స్!
- బంగారం దాచుకుని వచ్చిన ఫాతిమా, త్రిష
- గుర్తించిన కస్టమ్స్ అధికారులు
- ఆసుపత్రికి తీసుకు వెళుతుంటే కిడ్నాప్
- ఎనిమా చేయించి, బంగారం తీసుకెళ్లిన స్మగ్లర్లు
చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇద్దరు యువతుల కడుపులో బంగారం ఉందని తేల్చిన కస్టమ్స్ అధికారులు, వారిని ఆసుపత్రికి తీసుకెళుతుంటే, అధికారులను ఛేజ్ చేసిన గోల్డ్ మాఫియా వారిని కిడ్నాప్ చేసింది. ఆపై ఆ బంగారాన్ని తీసుకుని పారిపోయింది. యాక్షన్ సినిమాను మరపించే రీతిలో జరిగిన ఈ ఘటనలో గోల్డ్ స్మగ్లింగ్, కిడ్నాప్, నరాలు తెగే ఉత్కంఠత, ఛేజింగ్ లు ఎన్నో ఉన్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే...
మంగళవారం నాడు శ్రీలంక నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకు ఓ విమానం వచ్చింది. ప్రయాణికుల్లో గర్భం దాల్చినట్టుగా కనిపిస్తున్న శ్రీలంకకు చెందిన ఫాతిమా (32), త్రిష (36) ఉన్నారు. వీరిద్దరి తీరూ అనుమానాస్పదంగా కనిపించడంతో, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, వీరి కడుపులో 3 కిలోలకు పైగా బంగారం ఉన్నట్టు తేలింది. వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అధికారులు బయలుదేరగా, పల్లవరం రహదారిలో గోల్డ్ స్మగ్లింగ్ ముఠా వెంబడించింది. దాదాపు 10 మంది బృందం వీరిని అటకాయించి, ఆ మహిళలను కిడ్నాప్ చేసింది.
ఆపై వారిని చెంగల్పట్టులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి, ఎనిమా చేయించి బంగారాన్ని తీసుకుని ఉడాయించింది. ఆపై దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని మీనంబాక్కం సమీపంలో వదిలేసి వెళ్లగా, వారు సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి విషయం చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.