Andhra Pradesh: ఏ ఇష్యూ దొరక్క ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని పట్టుకున్నాయి: సీఎం జగన్
- ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తెస్తామని వెల్లడి
- పక్క రాష్ట్రాలకు ఇసుక తరలింపును అడ్డుకోవాలని ఆదేశం
- సమస్యపై వచ్చేవారం ‘స్పందన’ కార్యక్రమం
తమ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు అస్త్రాలు కరవయ్యాయని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వాటికి ఏ ఇష్యూ దొరక్కపోవడంతో ఇసుక అంశాన్ని పట్టుకున్నాయని అన్నారు. ఈ రోజు సీఎం జగన్ ఇసుక సమస్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి పెద్దిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సమస్యపై వచ్చేవారం ‘స్పందన’ కార్యక్రమం చేపడతామని సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇసుక వారోత్సవాలు తేదీలు వెల్లడిస్తామన్నారు.
వరద నీరు తగ్గగానే రీచ్ ల నుంచి ఇసుక సరఫరా చేయనున్నట్లు చెప్పారు. కిలోమీటర్ కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. పాలనకు సిద్ధమయ్యేలోగా ఆగస్టులో వరదలు వచ్చాయని, ఐదునెలల్లో 3 నెలల పాటు అవి కొనసాగాయని చెప్పారు. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలింపును అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావడానికి నిర్ణయం చేశామని, ఈ లోగా ఆర్డినెన్స్ జారీచేయనున్నామని తెలిపారు.