Temples: వారణాసిలో అమ్మవారి విగ్రహానికి మాస్క్ తగిలించిన పూజారి... అసలు కారణం ఇదే!
- వారణాసిలో పెరిగిన వాయు కాలుష్యం
- దేవుళ్ల విగ్రహాలకు మాస్క్ లు
- కాలుష్యం నుంచి కాపాడటానికే ఇలా చేస్తున్నామన్న పూజారి
వాయు కాలుష్యం దేవుళ్లకూ తప్పటంలేదు. వారణాసిలో వాయు కాలుష్యం అధికం కావడంతో భగవంతుడి విగ్రహాలకు మాస్క్ లు వేస్తున్నారు. దీపావళి తర్వాత దేశంలో.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో కాలుష్యం పెరిగిపోయింది. అప్పటినుంచి వారణాసి ప్రజలు ముఖాలకు మాస్క్ లు ధరించి బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవతా విగ్రహాలకు కూడా కాలుష్యంతో ముప్పువుందని చెబుతున్న పూజారులు విగ్రహాలకు మాస్క్ లు కడుతున్నారు.
వారణాసిలోని కాశీ విశ్వవిద్యాలయం ప్రాంతంలో శివపార్వతి మందిరంలోని విగ్రహాలకు పూజారి, భక్తులు మాస్క్ లను కట్టారు. ఈ సందర్భంగా పూజారి హరీష్ మిశ్రా మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘స్థానికులు దేవుడిని మానవ రూపంలో ఉన్నాడని భావిస్తూ పూజిస్తారు. వేసవిలో వేడి నుంచి రక్షించడానికి చందనం రాస్తాం. చలి నుంచి రక్షించడానికి కంబళ్లు, స్వెట్టర్లు వేస్తాం. అలాగే కాలుష్యం బారినుంచి కాపాడటానికి మాస్క్ లు వేశాం’ అని చెప్పారు.