Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అమిత్ షా సత్తా నిరూపించుకోవాలి: ఎన్సీపీ నేత శరద్ పవార్ సవాల్
- సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వం ఏర్పాటులో షా దిట్టని పేర్కొన్న పవార్
- శివసేనతో పొత్తుపెట్టుకోమని స్పష్టీకరణ
- ప్రతిపక్షంలో కూర్చుంటామని వెల్లడి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు గడిచిపోయాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటులో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వానికి ఎన్సీపీ నేత శరద్ పవార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమిత్ షా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సామర్థ్యం నిరూపించుకోవాలన్నారు. బీజేపీకి సంఖ్యా బలం లేని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అమిత్ షాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, అమిత్ షా తన రాజకీయ సత్తాను మహారాష్ట్రలో కూడా ప్రదర్శించాలని పవార్ అన్నారు. శివసేనతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమే పైచేయి సాధించినప్పటికీ సీఎం పదవి విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే.