Kannababu: అమరావతిలో వీధులే లేవు, పవన్ కల్యాణ్ ఎక్కడ నడుస్తారు?: మంత్రి కన్నబాబు వ్యంగ్యం

  • పవన్ పై ధ్వజమెత్తిన కన్నబాబు
  • తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ పవన్ పై ఆగ్రహం
  • ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే ఇంతలా ప్రవర్తించాలా? అంటూ వ్యాఖ్యలు

జనసేనాని పవన్ కల్యాణ్, వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. లాంగ్ మార్చ్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ మంత్రుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి కన్నబాబు జనసేనానిపై విమర్శలు చేశారు. సినిమాలు వదిలేసినా పవన్ యాక్టింగ్ మాత్రం వదల్లేదని వ్యాఖ్యానించారు. సినిమా డైలాగులకు ఓట్లు పడవని హితవు పలికారు. వరదల కారణంగానే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని, ఇసుక కొరతపై పవన్ కు మాట్లాడే హక్కులేదని స్పష్టం చేశారు. పవన్ కొన్నిరోజులుగా తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు.

ఇసుక సమస్య తీర్చకపోతే అమరావతి వీధుల్లో నడుస్తానని పవన్ కల్యాణ్ సవాల్ చేయడం హాస్యాస్పదమని అన్నారు. అసలు, అమరావతిలో వీధులే లేవని, చంద్రబాబు చూపించిన గ్రాఫిక్సే ఉన్నాయని ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు కనీసం ఒక్క బాత్ రూం కూడా కట్టలేదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లది ఫెవికాల్ బంధమని అభివర్ణించారు.

ఇటీవల పవన్ హిస్టీరియా వచ్చిన వాడిలా అందరినీ తిడుతున్నారని, ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే ఇంతలా ప్రవర్తిస్తారా? అని కన్నబాబు వ్యాఖ్యానించారు.  మీ ఎమ్మెల్యే సీఎం జగన్ పనితీరుకు పాలాభిషేకం చేశారు అంటూ కన్నబాబు తెలిపారు. "గత ఐదేళ్లలో ప్రశ్నిస్తానని ఎన్నిసార్లు ప్రజల ముందుకు వచ్చావో లెక్కలు ఉన్నాయి. అక్రమ కట్టడాలు కూల్చివేస్తే తప్పులా అనిపించిందా? మీరు స్థిరంగా నిలబడి ఒక్క నిమిషం మాట్లాడగలరా?" అని ప్రశ్నించారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని పవన్ కల్యాణ్ కు హితవు పలికారు. గత ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఇప్పుడు తలాక్ చెప్పారని కన్నబాబు విమర్శించారు.

Kannababu
YSRCP
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
  • Loading...

More Telugu News