Nara Lokesh: శవరాజకీయాలంటూ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు: నారా లోకేశ్

  • కాకినాడలో వీరబాబు అనే కార్మికుడి ఆత్మహత్య
  • మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్
  • వైసీపీ సర్కారుపై విమర్శలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు కుటుంబాన్ని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పరామర్శించారు. వీరబాబు కుటుంబ సభ్యుల రోదనలు చూసి లోకేశ్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇసుక కొరతతో పనుల్లేక కార్మికుల కుటుంబాలు ఇలా చితికిపోవడం మనసును కలచివేస్తోందని తెలిపారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వ చేతగానితనంతోనే రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చిందని మండిపడ్డారు. ఇసుక వాటాల కోసం వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారని, ఇసుక వివాదాలు తీర్చే పనిలో జగన్ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు ప్రాణాలు పోతున్నా జగన్ ఇసుక సమస్యను తేలిగ్గా తీసుకుంటున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. మీ ఇంట్లో ఎవరైనా  ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే స్పందిస్తారా? అంటూ నిలదీశారు. మరోవైపు, శవరాజకీయాలంటూ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆత్మహత్య చేసుకున్న ప్రతి కార్మికుడి కుటుంబానికి టీడీపీ తరఫున లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నామని ప్రకటించారు. భవన నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని, ఆత్మహత్య చేసుకున్న ప్రతి కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత ఇసుక విధానమే సరైనదని, ఇప్పటికైనా దాన్ని అమలు చేయాలని లోకేశ్ వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు.

Nara Lokesh
Telugudesam
YSRCP
Sand
  • Loading...

More Telugu News