RTC Strike: ఆర్టీసీని మూసేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాలి.. ఎవరూ భయపడొద్దు: అశ్వత్థామరెడ్డి
- కార్మికులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తోంది
- ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
- డిపో మేనేజర్ పై జరిగిన దాడికి కార్మికులతో సంబంధం లేదు
సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి చేరడానికి ఈ అర్ధరాత్రి వరకు తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో అఖిలపక్షంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేడు భేటీ అయింది. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, కార్మికులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉందని... అందువల్ల ఆర్టీసీని మూసేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవని చెప్పారు. చర్చలకు పిలవకుండా కార్మికులను భయపెట్టేలా ప్రకటనలు చేస్తున్నారని... ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. భైంసాలో డిపో మేనేజర్ పై జరిగిన దాడికి కార్మికులతో సంబంధం లేదని అన్నారు. డిపో మేనేజర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు.