Bihar: బీహార్లో 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలపై నిషేధం!
- నితీశ్ కుమార్ అధ్యక్షతన పాట్నాలో హైలెవెల్ మీటింగ్
- పాట్నాలో కమర్షియల్ వాహనాలపై కూడా నిషేధం
- ఇతర ప్రాంతాల్లోని వాహనదారులు తమ వాహనాలకు పొల్యూషన్ టెస్టులు చేయించుకోవాలంటూ ఆదేశం
బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలపై నిషేధం విధించింది. విపరీతంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన నిన్న పాట్నాలో హైలెవెల్ మీటింగ్ జరిగింది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, పాట్నా మెట్రోపాలిటన్ ప్రాంతంలో 15 ఏళ్ల పైబడిన కమర్షియల్ వాహనాలకు కూడా అనుమతి ఉండదని చెప్పారు. ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు వాహనాలపై నిషేధం లేదని... అయితే, వాహనదారులు తమ వాహనాలకు పొల్యూషన్ టెస్టులు జరిపించుకుని, సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని తెలిపారు.