CH Vidyasagar Rao: హైదరాబాద్ దేశానికే రెండో రాజధాని కావచ్చు: సీహెచ్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు!
- తెలుగు యూనివర్శిటీలో కార్యక్రమం
- డాక్టర్ శ్రీధర్ రెడ్డి కవితా సంపుటి ఆవిష్కరణ
- న్యూఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోందన్న విద్యాసాగర్ రావు
ప్రస్తుత దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో, భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా, హైదరాబాద్ నగరం రెండో రాజధాని అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాదులోని తెలుగు యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. యువ కళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి రచించిన కవితా సంపుటి 'శ్రీధర్ కవితా ప్రస్థానం'ను విద్యాసాగర్ రావు ఆవిష్కరించారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తుంటే, హైదరాబాద్ నగరం బహుశా రెండో రాజధాని కావచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు, కవులు పాల్గొన్నారు.