Chittore: ప్రేయసి కోసం దొంగగా మారి అడ్డంగా దొరికిన ప్రియుడు!

  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన బైక్
  • విచారిస్తే విషయం వెలుగులోకి

ఉన్నత చదువులు చదివాడు. తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు. అంతవరకూ బాగానే ఉంది. ఆమెకు అవసరమైన పరీక్ష ఫీజులు కట్టాలన్న ఆలోచనతో, కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించే బదులు, అడ్డదారి తొక్కి, అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బీఎన్ కండ్రిగ మండలం నీర్పాకోటకు చెందిన అఖిల్, ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి పరీక్ష రాసేందుకు అవసరమైన డబ్బులు లేక బాధపడుతూ ఉంటే, సహాయం చేయాలని భావించాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, అతను ఎంచుకున్న మార్గమే తేడా కొట్టింది.

కట్ చేస్తే... తన బైక్ చోరీకి గురైందని చంద్రగిరి మండలం, కేఎంఎం కాలేజీ, విద్యార్థి భరత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుంటే, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా దొరికాడు. బైక్ కు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో విచారించగా, దాన్ని అఖిల్ అనే వ్యక్తి తన వద్ద తాకట్టు పెట్టాడని చెప్పాడు. ఆ బైక్, భరత్ దేనని గుర్తించిన పోలీసులు, అఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు. తాను ప్రియురాలి కోసమే బైక్ ను దొంగిలించానని విచారణలో చెప్పాడు. ఎమ్మెస్సీ చదివిన అఖిల్, ప్రేయసి కోసం ఇలా దొంగగా మారాడని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచామని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News