Pawan Kalyan: సీఎం జగన్ పై వ్యక్తిగత ద్వేషం లేదు: పవన్ కల్యాణ్
- వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హితవు
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- కోరి తెచ్చుకున్న సీఎస్ ను ఎందుకు బదిలీ చేశారన్న పవన్
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న లాంగ్ మార్చ్ నిర్వహించిన ఆయన ఇంకా వైజాగ్ లోనే ఉన్నారు. మీడియాతో మాట్లాడుతూ, తనకు సీఎం జగన్ పైనా, వైసీపీ పైనా వ్యక్తిగత ద్వేషమేమీ లేదని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తాను ఎత్తిచూపిస్తున్నానని, వాటిని పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నానని వివరణ ఇచ్చారు. లాంగ్ మార్చ్ లో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ప్రతిస్పందించడం తెలిసిందే.
ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఇసుక కొరత ఇక్కడే ఎందుకని ప్రశ్నిస్తున్నానని, నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు పక్కనబెట్టి సమస్యలు ఎలా పరిష్కరించాలో దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపైనా పవన్ స్పందించారు. ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తిని ఇప్పటికిప్పుడు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తెరవెనుక ఏదో జరిగిందని, అక్రమాలు జరిగినట్టు భావిస్తున్నామని పేర్కొన్నారు.