Vijayareddy: తహసీల్దారు విజయారెడ్డి హత్యపై స్పందించిన మంత్రి సబిత

  • అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సజీవదహనం
  • పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
  • ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించిన సబిత

తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ మండల తహసీల్దారు విజయారెడ్డిని ఓ దుండగుడు ఆమె కార్యాలయంలోనే సజీవదహనం చేయడం తెలుగు రాష్ట్రాలను కుదిపివేసింది. సురేశ్ అనే వ్యక్తి విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘాతుకాన్ని అడ్డుకోబోయిన డ్రైవర్, అటెండర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, ఈ ఘటనపై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో సజీవదహనం సంఘటన బాధాకరమని, నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని అన్నారు. ప్రజల కోసం పనిచేసే అధికారులపై ఇలాంటి కిరాతకాలకు పాల్పడడం సరికాదని వ్యాఖ్యానించారు.

ఎమ్మార్వో తీరు నచ్చకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప ప్రాణాలు తీసేంత దారుణాలకు ఒడిగట్టడం సబబు కాదన్నారు. దీనివెనుక ఏం జరిగిందన్న విషయం పూర్తిగా తెలుసుకోవాలని అధికారులకు స్పష్టం చేశామని, కలెక్టర్ తో కూడా మాట్లాడామని సబిత మీడియాకు తెలిపారు.

Vijayareddy
Abdullapurmet
Telangana
MRO
Sabitha Indrareddy
  • Loading...

More Telugu News